దుర్గమ్మ గుడి విచారణలో తేలిన నిజాలు...

SMTV Desk 2018-01-07 11:11:24  Durgamma Temple Facts, EO Suryakumari, vijayawada

విజయవాడ, జనవరి 7 : విజయవాడ కనకదుర్గ ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిన పూజ వ్యవహారంలో దేవాలయ ఈవో సూర్యకుమారి పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవాదాయశాఖ, పోలీసుశాఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో సంప్రదాయానికి విరుద్ధంగా పూజలు జరిపినట్లు వెల్లడైంది. గతేడాది డిసెంబర్ 26న రాత్రి కనకదుర్గ ఆలయంలో ఈవో సుర్యకుమారే ప్రత్యేక పూజలు చేయించారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అమ్మవారికి మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజలు చేసి ఆ ఫోటోలను పంపాల్సిందిగా ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బంధువు పార్ధసారధికి ఆమె చెపినట్లుగా విచారణలో తేలింది. ఇందుకు బదులుగా పార్ధసారధి బంధువుకు ఉద్యోగం ఇప్పించేందుకు ఈవో సూర్యకుమారి ఆశ చూపించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అమ్మవారి మూలవిరాట్టుకు మహిషాసురమర్ధిని అలంకారం చేసి పూజలు నిర్వహించిన అనంతరం, ఆగంతకులు ఆర్టీసీ బస్టాండ్ లో నిద్రించారని అంతకుముందు మద్యాన్ని సేవించారని నివేదికలో స్పష్టం చేశారు. దసరా ఉత్సవాల సమయంలోనూ ప్రత్యేకించి అమ్మవారిని మహిషాసురమర్ధిని అలంకారణ చేసేందుకు పార్ధసారధి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చేవాడని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆ రోజున పదినర తర్వాత ఆగంతకుడు పూజలు నిర్వహించిన అనంతరం ఈవో తో 4 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వాస్తవానికి అదే రోజు ఉదయం సిబ్బందితోనూ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనునట్టుగా ఈవో చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు మొత్తం 30 మందికిపైగా సాక్షులకు ప్రశ్నించిన అధికారులు మహిషాసురమర్ధిని అలంకారణ జరిగిందని తేల్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ పూజలు జరిగినట్లు నివేదికలో పొందుపరచారు. కాగా, గుంటూరు జిల్లాకు చెందిన సుజన్ అనే వ్యక్తి ఈ అలంకారణకు సహకరించినట్లు తేలింది. ఈ మేరకు ఆలయంలో రక్షణ చర్యలు ప్రశ్నార్థకంగా మారయని బయటి వ్యక్తులు సులభంగా దేవాలయంలోకి ప్రవేశించారని అధికారులు విచారణలో స్పష్టం చేశారు.