ఏపీ గ్రూపు-2 మెరిట్ జాబితాలో తప్పులు.. సరిచేస్తాం : ఏపీపీఎస్సీ

SMTV Desk 2017-12-20 13:27:51  group 2, merit list, mistakes, appsc

అమరావతి, డిసెంబర్ 20 : ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూపు-2 (2016) ఉద్యోగ నియామక కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితాలో తప్పులు దొర్లాయి. ఎంపిక జాబితాలో తక్కువ మార్కులు వచ్చిన వారు ముందు వరుసలో ఉన్నారని, ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరుతున్నారు. తొలుత ప్రకటించిన ప్రకారం ఎంపిక జాబితాలో ఉన్న 1925 మందికి వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగాల్సి ఉంది. అభ్యర్థులు జాబితాలో ఉన్న నెంబర్లను అనుసరించి మార్కుల పరంగా పరిశీలించగా జరిగిన తప్పులు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి స్పందిస్తూ "ఏపీ ఆన్‌లైన్‌ వారు తొలిసారిగా కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక జాబితాను తయారుచేశారు. ఈ ప్రక్రియలో పలు తప్పులు దొర్లాయి. అభ్యర్థులు ఆందోళన చెందనక్కర్లేదు. అభ్యంతరాలుంటే స్వీకరించేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని వెబ్‌సైట్‌ ద్వారా సూచించాము. అందిన విజ్ఞప్తులను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటాము. ప్రకటించిన జాబితా ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించినది" అని పేర్కొన్నారు. ఈ ఉదంతంతో కమిషన్‌లో సాంకేతిక నిపుణుల కొరత మరోసారి స్పష్టమైంది.