బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే పోలీసు రుణాలు : డీజీపీ

SMTV Desk 2017-12-19 11:50:34  dgp, andrapradesh, resolutions, police, credits, welfare

అమరావతి, డిసెంబర్ 19 : రాష్ట్ర డీజీపీ సాంబశివరావు అధ్యక్షతన జరిగిన భద్రత సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం ఏపీ పోలీసుల సిబ్బందికి పలు వరాలు ప్రకటించింది. రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే.. 7.5 శాతం వడ్డీరేటుతో గృహ, 8.5 శాతం వడ్డీరేటుతో విద్యా, 11 శాతం వడ్డీరేటుతో వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని తీర్మానించారు. పోలీసుల పిల్లల విదేశీ విద్య కోసం గరిష్ఠంగా రూ.25 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పించనున్నారు. అలాగే భద్రత సంస్థలో తమ ఖాతా వివరాలు, ఆరోగ్య పరీక్షల చరిత్ర తదితర అంశాల గురించి సభ్యులు తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ రూపొందించారు. మధుమేహంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందికి ఇన్సులిన్‌, ఇతర మధుమేహం మందులను పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాలకు పంపిణీ చేస్తారు. ఎస్పీలు జిల్లా స్థాయిలో వైద్యులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయించి ఆరోగ్య సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన వైద్యంపై సిబ్బందికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి బందోబస్తు విధుల నుంచి మినహాయింపునిచ్చారు. టోల్‌ ఫ్రీ నెంబరు 90142 90290కు ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సమావేశం నిర్ణయాలను వెల్లడించింది.