తీరనున్న కోనసీమ ప్రజల చిరకాల వాంఛ..!

SMTV Desk 2017-12-19 10:55:59  railwayline, konaseema, inogration, amalapuram, modi

అమలాపురం, డిసెంబర్ 19 : కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం పనుల శంకుస్థాపనకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. అమలాపురంలో ఈ పాజెక్టుకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అపూర్వ ఘట్టం నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టుకోబోతోంది. దివంగత లోక్‌సభాపతి జీఎంసీ బాలయోగి సమయంలో 2004లో అమలాపురం భట్నవిల్లి సమీపంలో అప్పటి రైల్వేశాఖ సహాయమంత్రి రైల్వేస్టేషన్‌, రైల్వే అతిథి గృహం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇప్పుడు అక్కడే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అమలాపురం నుంచే రైళ్లు ప్రారంభమయ్యేలా ఫ్లాట్‌ఫాంలు ఎక్కువ నిర్మించాలని ఎంపీ రవీంద్రబాబు రైల్వే శాఖను కోరారు. కోటిపల్లి-నర్సాపురం రైలు ప్రాజెక్టులో భాగంగా అమలాపురంలో శంకుస్థాపన కార్యక్రమం జనవరి రెండోవారంలో జరిగే అవకాశాలున్నాయని ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు తెలిపారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ 19, 20 తేదీలలో దొరికిందని, ఈరెండు రోజుల్లో ఏదో ఒక రోజున ప్రధానిని కలిసి కోనసీమ రావాలని కోరనున్నట్లు చెప్పారు. ఆయన ఆమోదాన్ని బట్టి ముహూర్తం ఖరారు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ని కలిసి కోనసీమ రైల్వేలైను శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని వారు కోరారు.