పొలం వివాదం...తీసింది ప్రాణం

SMTV Desk 2017-12-09 14:08:01  yadamari, land dispute, women died, chittor

యాదమరి, డిసెంబర్ 09 : పొలం గట్టు వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మానవత్వం మరచి విచక్షణ రహితంగా ఓ మహిళను రొటోవేటర్‌తో తొక్కించి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం యాదమరి మండలం వరిగపల్లెకు చెందిన జగన్నాథరెడ్డి, అదే గ్రామంలో నివాసముంటున్న రంజిత్‌కు మధ్య కొన్ని సంవత్సరాలుగా భూ తగాదా నడుస్తుంది. దీనిపై కోర్టులో కేసు కూడా కొనసాగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం జగన్నాథరెడ్డి అతని భార్య విమలమ్మ(52) రొటోవేటర్‌ బిగించిన ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నడం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రంజిత్ పొలం దగ్గరకి చేరుకొని కేసు కోర్టులో ఉండగా ఎలా దున్నుతావని, దంపతులను అడిగాడు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి ఆవేశంతో రంజిత్ అదే ట్రాక్టర్‌తో పక్కనే జగన్నాథరెడ్డికి చెందిన జొన్న పొలాన్ని దున్నాడు. అక్కడితో ఆగకుండా పొలం గట్టుపై ఉన్న భార్య విమలమ్మను ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో రొటోవేటర్‌లో చిక్కుకొని విమలమ్మ పొలంలోనే మృతి చెందింది. తర్వాత భర్త జగన్నాధ రెడ్డి పై దాడి చేయడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో దగ్గరలోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.