వైకాపా బీసీ అధ్యక్షునిగా జంగా కృష్ణమూర్తి

SMTV Desk 2017-06-15 11:52:10  TDP Government,YSRCP Chairman Y.S.Jagan mohan reddy,Botsa satyanarayana

అమరావతి, జూన్ 14: వైకాపా బీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా జంగా కృష్ణమూర్తి ప్రమాణా స్వీకార మహోత్సవం బుధవారం అమరావతి జిల్లా గుంటూరు రాజాగారితోటలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షత వహించగా, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ .."దివంగత నేత వై. ఎస్ .రాజశేఖర రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని' అన్నారు. సంవత్సరం పాటు అందరూ సహనాన్ని ప్రదర్శించాలని ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే అన్నీ మంచి రోజులే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిర్లక్ష్యం చేసిందని , వీటిపై గ్రామ స్థాయిలోని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెదేపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని దోపిడీ ధ్యేయంగా పనిచేస్తుందని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ తదితర సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి లేదన్నారు.. గతేడాది బడ్జెట్‌లో సుమారు రూ.8 వేల కోట్లకు పైగా బీసీలకు కేటాయిస్తే రూ.582 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగతావి దారి మళ్లించారని విమర్శించారు. అనంతరం ఆయన జంగా కృష్ణమూర్తిని బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం కృష్ణమూర్తి వైఎస్‌ విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. కృష్ణ మూర్తి మాట్లాడుతూ రానున్న రోజుల్లో 13 జిల్లాల్లో బీసీలను ఏకతాటిపై తీసుకొస్తానన్నారు. శాసన మండలి ప్రతి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జంగా కృష్ణమూర్తిని భారీ గజమాలతో సత్కరించారు.