ఇవి ఎలియన్స్ పక్షులు కావు!

SMTV Desk 2017-11-22 14:53:06  Atavisakhadhikarulu, Barn Owls, Birds, vishakhapatnam

విశాఖపట్నం, నవంబర్ 22 : ప్రస్తుతం ఎవరి మాట్లాడినా విశాఖలోని వన్ టౌన్ కార్యాలయంలో కనిపించిన ఎలియన్స్ ప్రస్తావనే వినిపిస్తుంది. ఇటీవల యూట్యూబ్, వాట్స్ ఆప్, సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తున్న ఈ వింత పక్షులకు అందరు ఎలియన్స్ పక్షులుగా భావిస్తున్నారు. కానీ వీటిని పరిశీలించిన అటవీశాఖాధికారులు మాత్రం ఇవి అటవీ ప్రాంతాల్లో ఉండే జీలుగు పక్షులని తేల్చారు. గుడ్లగూబ జాతికి చెందిన ఈ జీలుగు పక్షులు వాటికంటే పెద్దగా ఉంటాయని, వీటిని ఇంగ్లిష్ లో బార్న్ ఔల్స్ అంటారని, వాటి సాంకేతిక నామం టైటో ఆల్బా అని, తెలుగులో జీలుగు పక్షులని వారు వెల్లడించారు. ఇవి పుట్టిన కొద్ది రోజుల వరకు వెంట్రుకలు మొలవవని, దీంతో ఇవి చిత్రంగా కనిపిస్తాయని, పూర్తిగా నిశాచర జీవులన్నారు. అయితే కేవలం రాత్రిపూట మాత్రమే ఇవి స్పష్టంగా చూడగలవని, ఎలుకలు, పందికొక్కులను ఆహారంగా తీసుకుంటాయని అన్నారు. వీటి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అలాంటి విటీకి వెలుతురు చూపించడం (ఫోటోలు, వీడియోల లైటింగ్) మంచిది కాదని అన్నారు. తల్లి సంరక్షణలో పెరిగే ఈ పక్షులను ఇబ్బంది పెట్టడం వల్ల మృతి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, వాటిని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల (జూ) అధికారులు తీసుకెళ్లారు.