ఏపీలో కొరియా పెట్టుబడులు..

SMTV Desk 2017-11-10 11:58:18  Koreas companies invest in AP, Develop industrial cluster.

అమరావతి, నవంబర్ 10 : కొరియా అంతర్జాతీయ ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ రాకతో కొరియాకు చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఆ దేశంలోని పారిశ్రామిక పట్టణం బూసాన్ తరహాలోనే ఏపీలోనూ ఓ పారిశ్రామిక క్లస్టర్ ను అభివృద్ధి చేయాలని కొరియా ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. అన౦తపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో 1800 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొరియా వ్యాపార వేత్తల బృందంతో సమావేశమైన ముఖ్యమంత్రి.. ఏపీని రెండో రాజధానిగా మార్చుకొని ఇక్కడ పెద్ద సంఖ్యలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొరియా అభివృద్ధి చేసే పారిశ్రామిక క్లస్టర్లలో దాదాపు 10 వేల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 6 వ తేదీన సీయోల్, బూసాన్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని పరిశ్రమల శాఖ స్పష్టం చేస్తోంది. ఆ దేశానికి చెందిన ఆటో మొబైల్, షిప్పింగ్, ఆహార శుద్ధి పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ, దక్షిణ కొరియాల మధ్య భాషా, ఆహారం తదితర అంశాల్లో సారూప్యతలు ఉన్నాయని వీటిని ఇతర రంగాలకు విస్తరించాల్సి ఉందని ఆ దేశ ప్రతినిధి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.