కియా సంస్థ పనులపై చర్చించిన ఎన్ అమరనాథ్ రెడ్డి...

SMTV Desk 2017-10-16 16:22:57  anantapur, kia motors plant in ananthpur, n amarnatha reddy, collector veera pandian

అనంతపురం, అక్టోబర్ 16: 13 వేల కోట్లకు పైగా పెట్టుబడి, 11 వేల మందికి ఉద్యోగాలు, నిమిషానికి ఒక కారు తయారీ అంటూ అనంత కరువుకు పరిష్కారం చూపుతూ ప్రతిపాదించిన కియా కారుల పరిశ్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో 600 ఎకరాలలో ఏర్పాటు కానున్న పరిశ్రమకు ఐదు దశలలో చేపట్టిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏపీఐఐసీ పర్యవేక్షణలో రూ. 175 కోట్ల మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా ఏపి పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి, కొరియా పర్యటనలో భాగంగా సోమవారం కియా మోటర్స్, హుండాయ్ మోబిస్, ఎస్ఎల్ గ్రూప్, సుంగ్ వూ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన, కియా సంస్థ చేపట్టిన పరిశ్రమ పనులు, ప్రభుత్వ౦ అందించిన సహకారాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇంకా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సమావేశంలో ఏపిఐఐసి ఎండి ఎ.బాబు, అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్, ప్రభుత్వ పారిశ్రామిక ప్రత్యేక ప్రతినిధి ఆర్ ప్రీతమ్ రెడ్డి పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో కియా పరిశ్రమ చేర్మన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశారు.