ఉదయం పెళ్లి సాయంత్రం ఆత్మహత్య..!

SMTV Desk 2017-09-21 14:25:13  Prakasam District Chirala, Engineering Students Suicide,

ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 21 : ఇటీవల కాలంలో కొన్ని ప్రేమ వివాహాలకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ విషాద సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో ఇదే బాటలోనే మరో ప్రేమ జంట ప్రాణాలు విడిచింది. ప్రకాశం జిల్లా చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న సందీప్‌ (22), గుంటూరు జిల్లా, మౌనిక (21) చీరాలలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు. సందీప్‌ సీఎస్‌ఈ మూడో సంవత్సరం కాగా, మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. మౌనిక కళాశాల హాస్టల్లోనే ఉండేది. వీరిద్దరూ ప్రేమించుకోవడంతో వివాహం చేసుకుందామని నిశ్చయించుకొని మంగళవారం ఉదయం యధావిధిగా కళాశాలకు బయలుదేరాడు. ఇద్దరూ చీరాల రైల్వే స్టేషన్‌లో కలుసుకున్నారు. అక్కడ నుంచి విజయవాడ వెళ్లి పెళ్లి చేసుకుని తిరిగి వస్తూ విషయాన్ని వారి పెద్దలకు చెప్పారు. వారి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పక్కన ఉండే స్నేహితుడికి సెల్‌ఫోన్‌లో జరిగిన సంఘటన పూర్వాపరాలను వివరిస్తూ మెసేజ్‌ పెట్టాడు. తాము ఆత్మహత్య చేసుకోదలచుకున్నట్లు అందులో పొందుపరిచాడు. తరువాత ఆ ఇద్దరి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. దీంతో సందీప్‌ స్నేహితుడు ఇంటికి వెళ్లి విచారించగా రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదని తల్లిదండ్రులు తెలిపారు. సందేహం వచ్చి మరో స్నేహితుడితో మోటారుసైకిల్‌పై వేటపాలెం రైల్వేస్టేషన్‌కు వెళ్లి పట్టాల వెంట కొంత దూరం వెతకగా వారి మృతదేహాలు కనిపించాయి. భయపడి విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, జీఆర్పీ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందజేశారు. జీఆర్పీ ఎస్సై రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.