ఫేస్ బుక్ పరిచయం ఆ టీచర్ ను నిండా ముంచేసి౦ది...!

SMTV Desk 2017-09-13 17:34:10  social media, facebook crime, 41 lakh worth Jewelry, fake messeges.

నూజివీడు, సెప్టెంబర్ 13 : సభ్యసమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా, మనుషుల ఆలోచనలు మాత్రం వికృత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన.. సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నా కొంతమంది వాటిని పెడచెవిన పెడుతూ ఫేస్ బుక్ కేటుగాళ్ళ వలలో పడుతున్నారు. అమాయకులే కాకుండా ఉన్నత చదువులు చదివిన వారు సైతం సోషల్ మీడియా వలలో చిక్కుకోవడం గమనార్హం. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన కడియం శివకామేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అయితే తాజాగా ఆమెకు ఫేస్ బుక్ లో థామ్సన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రెండు వారాల క్రితం థామ్సన్ ఫోన్ చేసి రూ. 41 లక్షల విలువైన ఆభరణాలు బహుమతిగా రాగా పంపుతున్నానని కామేశ్వరికి ఫోన్ చేశాడు. ఈ నగలు తీసుకోవాలంటే ముందుగా రూ. 8.52 లక్షలు కట్టాలని కోరాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మిన శివకామేశ్వరి ఆ డబ్బులను చెల్లించింది. ఆ తర్వాత ఎంత వేచి చూసినప్పటికీ కొరియర్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను సంప్రదించింది. సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతున్నా యువత మాత్రం ఇలాంటి సంఘటనపై అప్రమత్తంగా ఉండడం లేదు. ముఖ్యంగా చదువుకున్న వారు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు చెప్పే కల్ల బొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.