ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కృషి చేయాలి: ఏపీ సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-09-11 14:58:05  AP Chief Minister, TDP door to door, TDP Inti Intiki, Chandrababu Naidu

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: నంద్యాల, కాకినాడ ఫలితాల అనంతరం ప్రజలకు మరింత చేరువ కావడమే తన టార్గెట్‌గా భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తన తదుపరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, ప్రతిపక్షాన్ని లేకుండా చేయడమే అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 175 స్థానాల్లోనూ విజయం సాధించేందుకు నేతలు కదలి రావాలని కోరారు. 2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆపై ఇటీవలి నంద్యాల ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్న విపక్షాలకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువయ్యేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారాయన. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన అండగా తాను ఉన్నానని తెలిపిన ఆయన, ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని తెలిపారు.