తిరుమలేశుని బ్రహ్మోత్సవ తేదీలు...

SMTV Desk 2017-09-10 13:09:45  Tirupati, Tirupati Brahmotsavam, Srivari annual Brahmotsavam

తిరుపతి, సెప్టెంబర్ 10: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రహ్మోత్సవ వేడుకల ఈ సంవత్సర తేదీలను టీటీడీ వెల్లడించింది. ఈ నెల 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి, 23న రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు అదే రోజు రాత్రి 8 గంటలకు సమర్పించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు పెద శేషవాహన సేవ ఉంటుందని, ఆపై వరుసగా నిత్యమూ రెండు వాహన సేవలు ఉంటాయని వెల్లడించింది. 27వ తేదీ రాత్రి 7 గంటలకు గరుడవాహన సేవ, 28న సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథోత్సవం, గజవాహన సేవలుంటాయని, 30న రథోత్సవం, అక్టోబర్ 1న ఉదయం చక్రస్నానం ఉంటాయని దేవస్థానం బోర్దు తెలిపింది. చక్రస్నాన అనంతరం అదే రోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.