లవ్ స్టొరీ రివీల్ చేసిన రోజా!

SMTV Desk 2019-11-11 12:03:39  

ఆదివారం జరిగిన భీమిలి ఉత్సవంలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సందడి చేశారు. ఈ జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటూ సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనగా.. ఈ సందర్భంగా పలువుర్ని ఘనంగా సన్మానించారు. రోజా తన ప్రసంగంతో అందర్ని ఆకట్టుకున్నారు. తన సినిమా కెరీర్, లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చామంతి సినిమా కోసం ఇదే భీమిలి బీచ్‌లో ఏడాది పాటూ షూటింగ్ చేశామని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రోజా. భానుమతి, హీరో ప్రశాంత్, తాను ఏడాది ఇదే బీచ్‌లో ఉన్నామని.. తన సినిమా కెరీర్‌కు నాంది పలికింది ఇక్కడే అని భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. తన భర్త సెల్వమణితో ప్రేమ పుట్టింది కూడా ఇక్కడేనని చెప్పుకొచ్చారు. సెల్వమణి ఇక్కడే ఐ లవ్ యూ చెప్పడం.. ఆ తర్వాత 12 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్నారు. ఇద్దరు పిల్లల తల్లి గృహిణిగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నానంటే భీమిలితో ఉన్న అనుబంధం ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సైరా అన్నట్లుగా ఉందన్నారు రోజా. భీమిలి మంత్రిగా గంటా శ్రీనివాసరావు దోచుకుంటే.. ఇప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు నగరి ఎమ్మెల్యే.