ఇసుక కొరతపై గుంటూరులో లోకేష్ దీక్ష

SMTV Desk 2019-10-30 15:18:11  

ఏపీలో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఇసుక కొరత నెలకొందని ఆరోపిస్తూ ప్రతిపక్ష టీడీపీ పోరుబాట పట్టింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఒకరోజు దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. లోకేష్ దీక్షకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి లోకేష్ దీక్షలో కూర్చున్నారు. ఇసుక ప్యాకెట్లను దండలుగా వేసుకుని టీడీపీ నేతలు దీక్షకు దిగారు. నారా లోకేష్ మెడలో నల్లకండువా కప్పుకుని నిరసన తెలియజేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరి, మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఆయనకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చున్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో గుంటూరు కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడాయి.వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తూనే గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. జగన్ సర్కార్ తెచ్చిన నూతన విధానంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రతరమైంది. గత కొద్ది నెలలుగా ఇసుక లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.గతంలో ఇసుక ట్రాక్టర్ ధర రూ.2 వేల లోపు ఉండేదని, ఇప్పుడు అది రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పలుకుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంటే పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిపోతోందని చెబుతోంది. ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. అధికార పార్టీ నేతలు జేబులు నింపుకునేందుకు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది.