రాజధాని అమరావతి కడతారా లేదా? హైకోర్టు ప్రశ్న

SMTV Desk 2019-10-25 14:39:38  

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పనులను పూర్తిగా నిలిపివేసింది. రాజధాని ఎక్కడ నిర్మించాలో కమిటీ నిర్ణయిస్తుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో బాంబు పేల్చారు. అంటే జగన్ ప్రభుత్వానికి అక్కడ రాజధాని నిర్మించే ఉద్దేశ్యం లేదని అందుకే నిర్మాణపనులు నిలిపివేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రవిభజన జరిగి ఐదున్నరేళ్ళు పూర్తయినప్పటికీ పాలకపార్టీల రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాల వలన ఇంతవరకు ఏపీకి రాజధాని లేకుండా పోయింది. అయినప్పటికీ ఎవరూ సిగ్గుపడకపోవడం బాధాకరం.

రాజధాని నిర్మాణపనులలో జరుగుతున్న జాప్యంపై ఏపీ హైకోర్టులో ఇటీవల రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ సోమయాజులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

“అమరావతిలో హైకోర్టు ఏర్పాటుచేసి మా అందర్నీ ఇక్కడకు రప్పించారు కానీ ఇంతవరకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. మేము ఉండేందుకు క్వార్టర్స్ కట్టలేదు. కార్లు పెట్టుకొనేందుకు పార్కింగ్ లేదు. కోర్టుకు వస్తున్న లాయర్లకు పరిసర ప్రాంతాలలో కనీసం టీ, కాఫీలు కూడా దొరకని పరిస్థితులున్నాయి. ప్రభుత్వం రాజధాని పనులను పూర్తిచేయాలనుకొంటోందా...లేదా? మీ పార్టీలు, రాజకీయాలతో మాకు సంబందం లేదు. తక్షణం పనులు మొదలుపెట్టాలి. మీ అంతటా మీరు పనులు మొదలుపెడతారా లేక మమ్మల్ని ఆదేశాలు జారీ చేయమంటారా?ఇంకా సమయం కావాలంటే మేము చూస్తూ ఊరుకోము. ఆదేశాలు జారీ చేయవలసివస్తుంది. అప్పుడు కావాలనుకొంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. రెండువారాలలో దీనిపై మాకు ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన సమాధానం కావాలి,” అని అన్నారు. ఈ కేసును నవంబర్ 21కి వాయిదా వేశారు.