ఏపీ రాజకీయాలను డ్రామాలు, సినిమాలుగా మార్చేశారు!

SMTV Desk 2019-09-11 15:17:24  

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెటకారంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు అనాల్సింది ఛలో ఆత్మకూరు కాదనీ, ‘ఛలో నరసరావుపేట, ఛలో యరపతినేని మైనింగ్’ అనాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏపీ రాజకీయాలను డ్రామాలు, సినిమాలుగా మార్చేశారని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. అసలు ఆ మాటలు మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘ ప్రభుత్వం సాగర్‌కి నీళ్లు ఇస్తే.. రైతులు పొలాలు వేసుకుంటుంటే.. పచ్చని పల్నాడులో చిచ్చు రేపుతోంది నువ్వే చంద్రబాబు. ప్రజల చేత తిరస్కరణకు గురైన నేతలు ఇప్పుడు బాబు పక్కన చేరి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఐదేళ్ల పరిపాలనలో మీరు చేసిన హత్యలు, అరాచకాల జాబితా మా దగ్గర ఉంది. అక్రమ కట్టడంలో ఉన్న చంద్రబాబు అక్రమ మాటలు మాట్లాడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.