జనసేన కీలక నేత పార్టీ మారుతున్నారట ?

SMTV Desk 2019-09-09 11:39:30  

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో షాక్ తింది జనసేన పార్టీ.. దీంతో పార్టీ బలోపేతంపై జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. అయితే, జనసేనలో కీలకంగా పనిచేస్తున్న ఓ నేత.. ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు.. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరందుకోంది. అయితే, ఓ వర్గం ఆయనను ఆహ్వానిస్తుండగా.. మరోవర్గం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోందట.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన బాలరాజు.. పాడేరు నుంచి పోటీచేసి ఘోరపరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బరిలోకి దిగిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఊహించని భారీ మెజారిటీతో గెలుపొందారు. రాజకీయలకు ఆమె కొత్త కావడంతో మూడు నెలలపాటు పాలన సాదాసీదాగానే సాగుతున్నది. గతంలో భాగ్యలక్ష్మిని వ్యతిరేకించిన వైసీపీ వర్గం ఆమెకు దూరంగానే ఉంటున్నారట.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం పటిష్ఠంగా లేదని వైసీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో బలమైన నేత గురించి వైసీపీ చూస్తోందట.. బాలరాజు సీనియర్‌ కావడంతో వైసీపీలో చేర్చుకోవాలని కొంతమంది పార్టీ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి పార్టీలో చేరితే పాడేరు నియోజకవర్గం బాధ్యతలతోపాటు కీలకమైన నామినేటెడ్‌ పదవి కూడా సీఎం జగన్‌ అప్పగించనున్నారనే ప్రచారం సాగుతోంది. దసరా పండుగకు ముందే.. ఆయన వైసీపీ చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే, బాలరాజు చేరికను స్థానికంగా ఉండే కొందరు నేతలు ఆహ్వానిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.. ఆయనను పార్టీలో చేర్చుకుంటే.. లాభం కంటే ఎక్కువ నష్టమేనని కొందరు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.