చీటీల పేరుతో ఘరానా మోసం

SMTV Desk 2019-08-23 10:47:17  

ఆమె ఒక మహిళా నాయకురాలుగా అక్కడ ప్రజలను నమ్మించింది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని..స్వచ్చంధ సేవ సంస్థల నుండి ఉత్తమ మహిళా అవార్డులు వంటివి పొందింది. దీంతో అక్కడి అమాయక ప్రజలు ఆమెను గుడ్డిగా నమ్మారు. ఇదే అదునుగా చేసుకొని గోల్డ్ స్కీమ్, చిట్టీలు, బంపర్ డ్రా లు వంటి పెట్టి.. పేద ప్రజల చేత డబ్బులు కట్టించి కోట్లు రూపాయలు వసూలు చేసింది. చివరకు మొండి చేయి చూపించి బిచాణా ఎత్తేసింది. ప్రకాశం జిల్లాలో చీటీల పేరుతో మోసం చేసిన ఓ మహిళ బాగోతం బయటపడింది. అధిక వడ్డీలకు ఆశ చూపి ప్రజల నుంచి 16 కోట్లు వసూలు చేసి.. నిండా ముంచిన మహిళను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం మేజర్‌ గ్రామం ఈపూరుపాలెంలో మహిళా నాయకురాలిగా చెలామణి అవుతోన్న మాచర్ల పద్మావతి అనే మహిళ.. తన వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ సొంత బిల్టప్ ఇచ్చుకుంటూ తిరిగేది. ధనవంతుల కుటుంబానికి చెందిన వాళ్లుగా బిల్డప్ ఇస్తూ... కొన్నాళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. చిట్టీలు వేసిన వారి దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తానని నమ్మబలికింది. గోల్డ్ స్కీమ్‌ల బంపర్ డ్రాలు వంటి పెట్టి పేద ప్రజల చేత డబ్బులు కట్టించుకుని.. కోట్లు వసూలు చేసింది.
చీరాల మండలం మేజర్‌ గ్రామం ఈపూరుపాలెం, బోయినవారిపాలెం, పేరాల, చీరాల, పిట్టువారిపాలెం ప్రాంతాల్లోని ప్రజలు పద్మావతి దగ్గర చీట్టిలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పోలీసులు, ఆర్మీ ఉద్యోగులు, రైతులు, మధ్య తరగతి, నిరు పేదల వరకు పద్మావతి బిల్డిప్‌ను చూసి ఆమె దగ్గర చీట్టిలు వేశారు. అధిక వడ్డీలకు ఆశచూపి మొత్తం 16 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసింది. అయితే.. కాలం గడుస్తున్నా చిట్టీల డబ్బులు ఎంతకు ఇవ్వకపోవడంతో అనుమానంతో ఇద్దరు మహిళలు చీరాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత పద్మావతి బాధితులు ఒక్కొక్కరు బయటకి వచ్చారు. ఈ కేసు ఇన్వెస్ట్‌గేషన్‌లో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిట్టీల నిర్వాహకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.