కాబట్టి నేను వద్దని చెప్పా: ఏపీ సీఏం జగన్

SMTV Desk 2019-07-03 13:22:54  

అసెంబ్లీలో ఓ అంశంపై క్షుణ్ణంగా మాట్లాడేందుకు ప్రిపేర్ కావాలన్న తపన సభ్యుల్లో ఉండాలని ఏపీ సీఎం జగన్ తెలిపారు. లేదంటే ఎవ్వరూ రాణించలేరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అమరావతిలోని అసెంబ్లీ హాలులో శిక్షణ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ‘నాకు బాగా గుర్తుంది. అసెంబ్లీ జరిగే రోజుల్లో ఉదయం 4 గంటలకే మా ఇంట్లో ప్రిపరేషన్ జరిగేది.

నాతో పాటు మాట్లాడే 4-5 సభ్యులు ఇంటికి వచ్చేవారు. మొత్తం మెటీరియల్ ను పూర్తిగా చూసుకునేవాళ్లం. వాటిని హైలైట్ చేసుకునేవాళ్లం. ఆ తర్వాత సభలో లేచి మాట్లాడినప్పుడు.. మనం లాజికల్ గా మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేది ప్రజలకు కనెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయి రావడం చాలాచాలా ముఖ్యం’ అని సీఎం జగన్ తెలిపారు.

గతంలో జరిగినట్లు మాత్రం ఈసారి శాసనసభ సమావేశాలు జరగవని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘గతంలో అయితే మనల్ని మాట్లాడనిచ్చేవారు కాదు. విమర్శలు రాగానే మైక్ కట్ చేసేవారు. మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. వెంటనే వ్యక్తిగత విమర్శలు చేయడం మొదలుపెట్టేవారు. మీ నాయన ఇట్లా.. అనే దగ్గర నుంచి టాపిక్ ను సంబంధం లేని విషయాలన్నీ మొదలుపెడతారు. ఇవన్నీ దండిగా చూసినం.

కానీ మన పాలన అట్ల ఉండదు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓ ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మనవాళ్లు సలహా ఇచ్చారు. కానీ మనకు, వాళ్లకు తేడా ఉండాలి కాబట్టి నేను వద్దని చెప్పా’ అని జగన్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నవ్వడంతో సీఎం జగన్ కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. ‘రామచంద్రారెడ్డి అన్న నవ్వుతున్నాడు అక్కడ’ అంటూ సీఎం జగన్ కూడా నవ్వేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఒక్కసారిగా నవ్వేశారు.