ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులు

SMTV Desk 2019-06-06 14:31:12  jagan, jagan camp office,

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తొలిసారి నిరసనల సెగ తగిలింది. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఏఎన్ఎంలు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలనీ, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని కొత్త ప్రభుత్వమయినా తమకు న్యాయం చేయాలని కోరుతూ వాడు ఆందోళన చేస్తున్నారు. అయితే వీరి ఆందోళనను క్యాంపు ఆఫీసు అధికారులెవరూ పట్టించుకోలేదు. ఆందోళనకారులు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకురాకుండా మాత్రం కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. అయితే నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తారని తెలుసుకున్న 2018 డిఎస్సీ అభ్యర్థులు మూడు రోజుల నాడు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అధికారులు వైఫల్యంతో తమకు అన్యాయం జరిగిందని, 3వేల మంది డిఎస్సీ అభ్యర్థులు రోడ్డున పడాల్సి వచ్చిందని బాధిత అభ్యర్థులు వాపోయారు. 8 రోజుల్లో 16 సెషన్లు పెట్టి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడంతో పరీక్ష మరింత కఠినంగా మారిందని అన్నారు. తక్షణమే నార్మలైజేషన్ పద్ధతి పునరుద్ధరించి సెలక్షన్ లిస్టును విడుదల చేయాలని వారు కోరారు. అయినా స్పందన లేకపోవడంతో ఈరోజు వారు ఆందోళనకి దిగారు.