నేడు రంజాన్

SMTV Desk 2019-06-05 15:09:29  Ramzan,

రంజాన్ పర్వదినాల ఉపవాసదీక్షలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. దేశంలోని తమిళనాడు, బీహర్ తదితర రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం నెల వంక కనిపించినట్లు ధృవీకరణలతో హైదరాబాద్‌కు చెందిన రుహియతే- ఎ హిలాల్ కమిటీ బుధవారం ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోవాలని ప్రకటించింది. మంగళవారం సాయంత్రం మోజంజాహి మార్కెట్ లోని రుహియతే ఎ హిలాల్ కమిటీ అధ్యక్షులు ఖుబుల్ పాష సత్తారీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నెల వంకను చూసినట్లు ధృవీకరణలు అందాయని తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఈద్ ఉల్ పితర్ వేడుకలను నిర్వహించాలని ఖరారు చేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఇదిలా ఉండగా మే 6వ తేదీ రంజాన్ నెల వంకతో ముస్లిం సోదరులు ఉపవాసదీక్షలను ప్రారంభించారు. జూన్ 4వ తేదీ షవ్వాల్ మాసం నెల వంక దర్శనంతో ఉపవాసదీక్షలను విరమించి, బుధవార ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ వేడుకలను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఈద్ నమాజ్ కోసం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఈద్గాలను సర్వం సిద్దం చేశారు. చారిత్రాత్మకమైన మీరాలం ఈద్గా, హకీ గ్రౌండ్ (బిలాల్) ఈద్గా, ఫస్ట్ లాన్సర్ ఈద్గాలతో పాటు చారిత్రాత్మకమైన మక్కా మసీదు, రాయల్ మసీదులతో పాటు జిల్లా, పట్టణ, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఈద్గాలను సర్వం సిద్దం చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈద్గాలు, మసీదుల్లో ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక నమాజ్ ప్రార్ధనలు నిర్వహిస్తారు. అనంతరం ఒక్కొక్కరినొక్కరు ఆపాయ్యంగా కలిసి ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు