రెండేళ్లలో పోలవరం పూర్తి

SMTV Desk 2019-06-04 15:33:13  POlavaram,

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర జలవనరులపై సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, జలవనరుల విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రాజక్టు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ఏపీకి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు అని, అధికారులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ఆరాతీశారు. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎంకు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేసిందని.. కేంద్రం నుంచి ఇంకా రూ.4200 కోట్లు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీతో పూర్తిగా నీళ్లు ఇవ్వగలమని అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించాలని వారికి జగన్ ఆదేశాలు జారీచేశారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో నిధులు ఎలా సమకూర్చాలి.. రాయలసీమలో మంచి నీటి సమస్య లేకుండా ఉండాలంటే అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులతో చర్చించారు. కాగా, వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును జగన్ స్వయంగా సందర్శించేందుకు నిర్ణయించుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఈ నెల 6న మరోసారి జలవనరుల శాఖపై సమీక్షించనున్నారు.