మంత్రి వర్గం మీద దృష్టి పెట్టిన జగన్. ..

SMTV Desk 2019-06-03 15:20:24  jagan, Cabinet,

ఏపీలో ఘన విజయం సాధించి ముఖ్య మంత్రి పీఠం ఎక్కిన జగన్ ఇప్పుడు మంత్రి వర్గం మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు వైఎస్ ఆర్ పార్టీ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి 151 మంది ఎమ్మెల్యేలతోపాటు పార్టీకి ఇప్పటి వరకూ ఉన్న ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు, అసెంబ్లి సమావేశాల తేదీ ఖరారుపై చర్చించనున్నారు. ఇప్పటికే మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న అంశంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు అధికారిక సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు మంత్రివర్గ కూర్పు మీద సన్నిహితులతో కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ముందుగా అందరు శాసనభ్యులు, శాసనమండలి సభ్యులకు తెలియజెప్పాలని జగన్‌ నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగానే ఆయన వైయస్సార్‌ ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు, పార్లమెంటు జిల్లాకు ఒక్కరికి మంత్రి పదవి కేటాయింపు వంటి రెండు సూత్రాల ప్రాతిపదికన మంత్రులను ఎంపిక చేస్తున్నారు. అయితే, పార్లమెంటు జిల్లా మంత్రి పదవి కల్పించే సూత్రాన్ని పాటిస్తే సామాజిక సమీకరణాలు తేడా వస్తున్నాయని, అలా అని సామాజిక సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుంటే పార్టీ సీనియర్ల అభ్యర్థనలు, ఇప్పటి వరకూ పార్టీని అంటిపెట్టుకుని ఖర్చుపెట్టుకుని సేవచేసిన వారికి అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పలు జిల్లాల్లో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. మంత్రివర్గం ఎంపిక ఎలా చేశారు అనేది ముందుగానే పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వివరించేందుకు జగన్‌ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం మత్రివర్గ సభ్యుల జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు నుండి బయటకు వచ్చిన సమాచారం.