హైదరాబాద్‌లో ఉగ్రవాదులను పూర్తిగా కట్టడి చేస్తా

SMTV Desk 2019-06-01 12:21:00  Kishan reddy, terrorits,

ఉగ్రవాదులకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తన తొలి పలుకులోనే ఉద్దేశాన్ని వెల్లడించారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోయినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై అలా జరగదని, హైదరాబాద్‌ను శాంతి సామరస్యానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుపుతామన్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులను పూర్తిగా కట్టడి చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మొదటి సారిగా మీడియాతో మాట్లాడారు. అమాయక ముస్లింల పట్ల బిజెపికి ఎలాంటి ద్వేషంలేదన్నారు. మతం ముసుగులో ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కాగా తొలిసారిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసే అవకాశం రావడం అమితమైన ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

పైగా బిజెపి జాతీ య అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో కలిసి పనిచేసే అవకాశం లభించడం మరింత సంతోషం కలుగుతోందన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోననని ఆయన స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి తన వల్ల ఎలాంటి మచ్చ రానియబోనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్లంలో స్థానం లేనందువల్ల ఆ రాష్ట్రాన్ని కూడా చూసుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం తనకు అప్పగించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ రాష్ట్రంలో కూడా బిజెపి పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు.