మేనల్లుడే మేలు చేశాడా..?

SMTV Desk 2019-05-29 15:07:06  ktr, harish rao

తెలంగాణ రాజకీయాల్లో మంచి ఊపు కనబరిచిన కారు పార్టీ ముందుకు దూసుకువెళ్లడమే కానీ బ్రేకులు ఇప్పట్లో వేయాల్సిన అవసరం ఉండదని ఆ పార్టీ అగ్ర నాయకత్వం భావించింది. అదే ఊపుతో తెలంగాణాలో ఉన్న 16 ఎంపీ సీట్లను దక్కించుకుంటుందని ఆ పార్టీ భావించింది. అయితే ప్రజలు మాత్రం కారు స్పీడ్ కి బ్రేకులు వేసేసారు.

కేవలం 09 స్థానాలకే టీఆర్ఎస్ ను పరిమితం చేశారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం మొదలయ్యింది. కేసీఆర్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న వారసులకంటే ఆయన మేనల్లుడు హరీష్ రావు రాజకీయం కారణంగానే టీఆర్ఎస్ పరువు కొంచెమైనా నిలబడిందని పార్టీలో చర్చ నడుస్తోంది...

ఒక‌ప్పుడు త‌న మామకు తగ్గ మేనల్లుడిగా, కేసీఆర్ కు కుడిభుజంగా ఉంటూ తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి న‌డిచిన హ‌రీష్ రావు పార్టీకి బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క భూమిక పోషించారు. కేసీఆర్ అప్ప‌గించిన అన్ని బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించి టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూట‌ర్ గా గుర్తింపు పొందారు. కేసీఆర్ తరువాత ఆయన రాజకీయ వారసుడు హరీష్ రావు అనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన్ను కేసీఆర్ పక్కనపెట్టారు.

రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక పార్టీలో హ‌రీష్ రావు ప్రాధాన్యం త‌గ్గుతూ వ‌స్తోంది. టీఆర్ఎస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు బాధ్య‌త‌లు ఇవ్వ‌డం, హరీష్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వకపోవడం ఇవన్నీ హరీష్ ను కేసీఆర్ దూరం పెడుతున్నాడు అనడానికి సంకేతాలు అనే అంతా భావించారు..

ఇక మొత్తం పార్టీలో పెత్తనం అంతా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ది కావడంతో పార్టీ నాయకులు కూడా కేటీఆర్ చుట్టూనే తిరిగారు.

కేటీఆర్ కూడా త‌న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగానే నిర్వ‌ర్తించారు. కానీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల బాధ్య‌త‌లు లీసుకున్న ఆయ‌న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేశారు. సారూ కారు ప‌ద‌హారు నినాదంతో వెళ్లి 16 సీట్లూ టీఆర్ఎస్ ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ 9 స్థానాల‌కే టీఆర్ఎస్ ప‌రిమితం అయ్యింది.కేటీఆర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల ఉన్న క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటును సైతం గెల‌వ‌లేక‌పోవ‌డం ఆయ‌న‌కు షాక్ ఇచ్చింది.

ఓ స‌మ‌యంలో ఆయ‌న స‌ర‌దాగా హ‌రీష్ రావుకు మెద‌క్ లో ఎక్కువ మెజారిటీ వ‌స్తుందా.? క‌రీంన‌గ‌ర్‌లో వ‌స్తుందా చూసుకుందామ‌ని స‌వాల్ చేశారు. కరీంనగర్ బాధ్య‌త‌లు కేటీఆర్ చూడ‌గా, మెద‌క్ బాధ్య‌త‌లు హరీష్ రావు చూసుకున్నారు. మెద‌క్ కే ప‌రిమితం అయిన హ‌రీష్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఇక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి మూడు ల‌క్ష‌ల‌కు పైగా మెజారిటీతో గెలిచారు.

ఇదే స‌మ‌యంలో క‌రీంన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ విజ‌యం సాధించారు. మొత్తంగా చూస్తే ఆ గెలిచిన స్థానాల వల్ల టీఆర్ఎస్ పరువు నిలబడింది అంటే అది కేవలం హరీష్ కృషే అని అంతా భావిస్తున్నారు.