రక్షణరంగంలో కూడా భారత్‌ విజయ భేరి

SMTV Desk 2019-05-29 12:02:46  india, akash,

అంతరిక్ష రంగంలోనే కాకుండా రక్షణరంగంలో కూడా భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశానికి అవసరమైన బాంబులు, క్షిపణులు తయారుచేసుకొంటోంది. తాజాగా భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సంస్థ గత శుక్రవారం రాజస్థాన్‌లో పోఖ్రాన్‌లో 500 కేజీలు బరువుగాల ఈనెర్షియల్ గైడెడ్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ గైడెడ్ బాంబును భారత్‌ వాయుసేనకు చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించి చూశారు. ఇది భూమిపై కదులుతున్న లక్ష్యాలను సైతం ఖచ్చితంగా చేదించగలదని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.

దాని తరువాత ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి సోమవారం ఆకాశ్-1 ఎస్ క్షిపణిని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి భూమి నుంచి ఆకాశంలో 18-20 కిమీ ఎత్తులో ప్రయాణించే శతృదేశాల యుద్ధవిమానాలను, హెలికాప్టర్‌లను, వివిద రకాల క్షిపణులను కూడా కూల్చగలదు. వరుసగా రెండు రోజులు రెండుసార్లు నిర్వహించిన ఆకాశ్-1 ఎస్ క్షిపణి పరీక్షలు విజయవంతం అయినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత వీటిని భారత్‌-పాక్‌ సరిహద్దుల మోహరించే అవకాశం ఉంది.