మోదీ తో ముగిసిన జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

SMTV Desk 2019-05-26 17:08:57  Modi, Jagan,

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ ఎల్పీ లీడర్‌గా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న జగన్‌ నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన మోదీని అభినందించిన అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం వీరిద్దరూ దాదాపు గంటకు పైగా భేటీ జరిగింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు తదితర అంశాలపై జగన్ వివరిస్తుంటే, సమస్యలన్నింటినీ విన్న మోడీ, సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎటువంటి సమస్య ఉన్నా, పరిష్కరించేందుకు తనవంతు కృషిని కేంద్రం చేస్తుందని మోడీ హామీ ఇచ్ఛారని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, ప్రజల సెంటిమెంట్ తో కూడిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని కూడా జగన్ కోరారు. మోదీతో భేటీ అనంతరం ఏపీ భవన్ కు బయలుదేరిన జగన్, మార్గమధ్యంలో అమిత్ షా ఇంటికి వెళ్లి ఆయన్ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో అమిత్ షాతో భేటీ లేనప్పటికీ, మోదీ సూచన మేరకు జగన్, అమిత్ షా ఇంటికి వెళుతున్నట్టు చెబుతున్నారు. మారిన షెడ్యూల్ కారణంగా మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ భవన్ కు చేరుకోవాల్సిన జగన్, ఒంటిగంట తరువాతే అక్కడకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో జగన్‌ వెంట సీఎస్‌ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పలువురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు.