విపక్షాలకు ఝలక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

SMTV Desk 2019-05-07 16:19:03  Supreme court,

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఏపీ భవన్‌లో చంద్రబాబుతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా భేటీ అయ్యారు. వీవీ ప్యాట్‌ల అంశంపై చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికలలో 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటూ టీడీపీ సహా 21 విపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్‌ మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు విపక్షాల వాదనలు వినడానికి నిరాకరించింది. నియోజగవర్గంలో ఐదు వీవిప్యాట్‌లను లెక్కించాలని గతంలో ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.

వీవీప్యాట్‌ల అంశం మంగళవారం సుప్రీం కోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎంపీ డి.రాజా, టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, మాగంటి బాబు తదితరులతో కలిసి ఆయన సుప్రీం కోర్టుకు వచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ ధర్మాసనంలోని విజిటర్స్‌ గ్యాలరీలో వీరు కూర్చున్నారు.కనీసం 50శాతం వీవీప్యాట్‌ చీటీలను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘ఈ అంశంలో మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లపై కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తీర్పు వెల్లడించింది.