భానుడు భగభగ, వారం రోజుల్లో వడదెబ్బకు 8 మంది మృతి

SMTV Desk 2019-05-05 16:36:28  Temparature,

తెలుగు రాష్ట్రాలు అగ్ని గోళాలను తలపిస్తున్నాయి. సండే.. మండే అయిపోయింది. ఉదయాన్నే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వెళుతూ.. వెళుతూ ఫణి తుపాన్ మిగిల్చిన పొడి వాతావరణం రాష్ట్రాన్ని ఉడికిస్తోంది. సాధారణంగా వాతావరణం చల్లబడే సాయంత్రం 4 గంటల సమయంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపరుస్తోంది. ఆ సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో 45.64 డిగ్రీల మేర ఎండ కాసింది. రాజమండ్రిలో 46, పోలవరంలో 45.89 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాంధ్ర మినహా కోస్తా, రాయలసీమల్లో భారీ ఉష్ణోగ్రతలు కొనసాగాయి. ఉదయం నుంచే మొదలైన ఎండలు సాయంత్రం 6 గంటల వరకు ప్రభావం చూపాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వడగాల్పులు పెరిగాయి. బెజవాడ సహ 100 ప్రాంతాల్లో 43, 93 ప్రాంతాల్లో 42, 120 ప్రాంతాల్లో41, 129 ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఎండలు కాసాయి. ఎండలు మరింత పెరుగుతాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇటు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. వారం రోజుల నుంచి ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజుల్లో వడదెబ్బకు సుమారు 8 మంది మృతి చెందినట్లు సమాచారం. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా మొత్తం 46 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతోంది. ఉదయం 6-30 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది