ఎంపీ జేసి దివాకర్‌రెడ్డికి ఎన్నికల సంఘం గట్టి షాక్

SMTV Desk 2019-05-03 11:30:08  JC divakar reddy,

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన ఎన్నికల ఖర్చు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసి దివాకర్‌రెడ్డికి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ, సీపీఐ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లగా జేసీ కామెంట్లపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది. గత నెల ఉండవల్లి ప్రజా వేదిక వద్ద .ఏసి దివాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

దీంతో జేసి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు వైకాపా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జేసిని అరెస్ట్‌ చేయాలని డిమండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం దివాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఏన్నికల సంఘం ఆదేశించింది. అనంతపురం లోక్ సభ నుంచి జేసీ కుమారుడు పవన్ బరిలో ఉండగా .. తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ తమ్ముడు ప్రభాకర్ కుమారుడు అస్మిత్ పోటీ చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి జేసీపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ ఆదేశించారు.