ఎన్నారై చిగురుపాటి జయరాం కేసు: శిఖా చౌదరికి క్లీన్‌ చిట్

SMTV Desk 2019-05-01 16:26:21  NRI Chigurupati Jayaram, shikha choudary

ఎన్నారై చిగురుపాటి జయరాం 2019, జనవరి 31న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విదితమే. ఏపీ నుంచి జూబ్లీహిల్స్‌ ఠాణాకు బదిలీ అయిన కేసును ఏసీపీ కె.ఎస్‌.రావు దర్యాప్తు చేపట్టారు. ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసును ఎట్టకేలకు తెలంగాణా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పోలీసులు క్లీన్‌ చిట్ ఇచ్చారు. ఈ కేసులో మొదటి నుంచి అనుమానిస్తూ వచ్చినట్టు శిఖాచౌదరికి ఎలాంటి ప్రమేయం లేదని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ రావు దాదాపు 390 పేజీల అభియోగపత్రాన్ని నిన్న నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. జయరాం హత్యకేసులో కార్మిక సంఘం నేత బీఎన్ రెడ్డికి ప్రమేయం ఉన్నట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి సహా 8 మందిని అరెస్టు చేశారు.



నిందితులకు సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఏసీపీపైన పోలీసు శాఖ వేటు వేసింది. రాకేశ్‌రెడ్డికి, జయరాంకు వ్యాపార విషయాల్లో పరిచయం ఏర్పడిందని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే శిఖాచౌదరికి రాకేష్‌రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలోనే వీరికి విభేదాలు వచ్చాయి. మరోవైపు కార్మిక సంఘం నాయకుడు బీఎన్‌ రెడ్డితో రాకేశ్‌రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా హత్యతో ఆయనా జయరాం హత్యకు సహకరించినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీలు, కాల్‌డేటా ఆధారంగా బీఎన్‌ రెడ్డి.. జయరాం హత్యకు రెండు రోజుల ముందు అంటే జనవరి 29న, 30న రాకేష్‌రెడ్డి నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. వ్యాపార లావాదేవీలతోనే రాకేశ్‌రెడ్డి తాను కలిసినట్లు ఆయన చెబుతున్నా హత్యతో సంబంధం ఉండటంతోనే తరచూ అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. త్వరలోనే బీఎన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.