నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇక లేరు

SMTV Desk 2019-05-01 12:16:30  Spy reddy,

ఎస్పీవై రెడ్డిగా సుపరిచితులైన నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్.పెద్ద ఎరికల్ రెడ్డి (69) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధి బాధపడుతుండటంతో హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించి కనుమూశారు.



వరంగల్ ఎన్.ఐ.టిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తరువాత ఆయన ముంబైలోని బాబా ఆటమిక్ రీసర్చ్ సెంటరులో ఉద్యోగం చేశారు. కొంతకాలం చేసిన తరువాత ఆ ఉద్యోగాన్ని మానేసి తన సొంత ఊరు నంద్యాల కేంద్రంగా ‘నంది పైపులు’ తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే ఆయన ‘పైపుల రెడ్డి’ గా కూడా ప్రసిద్ది చెందారు. ఆ తరువాత ఎస్పీవై రెడ్డి విద్యాసంస్థలను నెలకొల్పారు.

ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి 1991 ఎన్నికలలో నంద్యాల నుంచి బిజెపి తరపున లోక్‌సభకు పోటీ చేశారు కానీ ఓడిపోయారు. కానీ 2004 2009, 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు పోటీ చేసి గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున మళ్ళీ నంద్యాల నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఘనా విజయం సాధిస్తానని నమ్మకం ఉన్నప్పటికీ ఫలితాలు రాకమునుపే కనుమూశారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో సహా పలువురు ప్రముఖులు ఎస్పీవై రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.