మారుతీరావుకు బెయిల్ మంజూరు

SMTV Desk 2019-04-27 11:30:27  maruthi rao,

గత ఏడాది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా అతని మావగారు తిరునగరు మారుతీరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అదే కేసులో అరెస్ట్ అయిన అతని సోదరుడు శ్రవణ్ కుమార్, కరీంలకు కూడా హైకోర్టు శుక్రవారం బెయిల్‌పై మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నంలోగా వరంగల్ జైలు అధికారులకు చేరే అవకాశం ఉంది. ఉత్తర్వులు అందిన వెంటనే వారు ముగ్గురు జైలు నుంచి విడుదలవుతారు.

వైశ్య కులానికి చెందిన మారుతీరావు కుమార్తె అమృతవర్షిణి, దళితుడైన పెరుమాళ్ళ ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారిరువురూ మిర్యాలగూడాలోనే గల ప్రణయ్ ఇంట్లో అన్యోన్యంగా కాపురం చేసుకొనేవారు. ఆమె గర్భం దాల్చడంతో ప్రణయ్ ఆమెను ప్రతీనెల వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్ళేవాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వారిరువురూ ఆసుపత్రికి వెళుతుండగా ఒక కిరాయి హంతకుడు వెనుక నుంచి వచ్చి కత్తితో ప్రణయ్ మెడపై బలంగా వేటు వేయడంతో ప్రణయ్ చనిపోయాడు. తన కూతురు ఒక దళితుడిని ప్రేమించి పెళ్లిచేసుకోవడం సహించలేక పగతో రగిలిపోతున్న మారుతీరావు కిరాయి హంతకుడితో హత్య చేయించినట్లు కనుగొన్న పోలీసులు అతనిపై పిడి యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటున్న ముగ్గురు నిందితులు బెయిల్‌పై కోరుతూ వరుసగా రెందుసార్లు పిటిషన్లు వేశారు. మొదటిసారి హైకోర్టు తిరస్కరించినప్పటికీ రెండవసారి వారికి బెయిల్‌పై మంజూరు చేసింది.

తన భర్తను హత్య చేసిన తన తండ్రి, చిన్నాన్న జైలు నుంచి విడుదల కాబోతుండటంతో అమృతవర్షిణి, ప్రణయ్ కుటుంబ సభ్యులు మళ్ళీ వారు తమకేమైనా అపకారం చేస్తారేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.