ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్

SMTV Desk 2019-04-17 15:27:39  Ap re poling,

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఇందుకు అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ అధికారికంగా ప్రకటన చెయ్యనుంది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలకు తోడ ఈవీఎంల మొరాయింపు ఇతర సాంకేతిక సమస్యలు ఎక్కువగా తలెత్తాయని కలెక్టర్లు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది.

వాటి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ... కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు.నిన్న సచివాలయంలో ద్వివేది విలేకరులతో మాట్లాడారు. ఈసీ ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం కలనూతలలో ఉన్న 247వ పోలింగ్‌ స్టేషన్‌, కాగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని 94వ పోలింగ్ స్టేషన్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ స్టేషన్‌లో కూడా మరోసారి పోలింగ్ నిర్వహించాలని కోరారు. కలెక్టర్ ప్రతిపాదనను సీఈవో ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ రెండు కేంద్రాలతో పాటు నెల్లూరు జిల్లాల్లోని మరో రెండుచోట్ల రీపోలింగ్‌ నిర్వహించే అంశంపై ఈసీఐ ఇవాళ నిర్ణయం ప్రకటించే అవకాశముంది.