వీవీప్యాట్స్ స్లిప్పుల కలకలం.

SMTV Desk 2019-04-16 16:06:41  vv pat slips,

అమరావతి :ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలని బీజేపీయేతర రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వందలకొద్దీ వీవీప్యాట్ స్లిప్పులు బయపడ్డాయి. ఇప్పటికే వీవీప్యాట్లపై చర్చ జరుగుతుండగా.. ప్రభుత్వ హైస్కూల్లో స్లిప్పులు బయటపడటం కలకలం రేపింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 300కి పైగా వీవీప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయి. దీంతో.. అధికారులు అప్రమత్తమై కారణాలు విశ్లేషిస్తున్నారు. స్లిప్పులను ఆత్మకూరు ఆర్డీవో స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

బయటపడ్డ వీవీప్యాట్ స్లిప్‌లు ఎక్కడివి..? అక్కడే ఎందుకు పడి ఉన్నాయని ఆరా తీశారు. అయితే.. సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన ఆర్డీవో.. అవి మాక్ పోలింగ్ డెమోలో ఉపయోగించిన వీవీప్యాట్ స్లిప్‌లు అని నిర్థారణకు వచ్చారు. పొరపొటున అక్కడ మరిచిపోయినట్లు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు.

ఒకవేళ డెమోలో ఉపయోగించిన వీవీప్యాట్ స్లిప్‌లే అయితే.. ప్లాస్టిక్ కవర్‌లో భద్రపరచడమో.. లేదంటే తగలబెట్టాల్సింది. కాగా.. అధికారుల వివరణపై అనేక అనుమానాలు కల్గుతున్నాయి. గోప్యంగా ఉంచాల్సిన వాటిని బయట ఎందుకు మరిచిపోయారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఆర్టీవో చెప్తున్నట్లు డెమో స్లిప్పులేనా.. లేదంటే ప్రజా ప్రతినిధిని ఎన్నకునేందుకు ఓటరు తీర్పా అన్నది సందేహంగా మారింది.