బోరు బావిలో పడిన మరో చిన్నారి..

SMTV Desk 2017-08-15 18:50:37  guntur, borvel, 2 years boy, ummadivaram,

గుంటూరు, ఆగస్ట్ 15 : మొన్న రంగారెడ్డి జిల్లా చేవెల్ల సమీపంలోని ఇక్కారెడ్డి గూడ బోరు బావిలో పడిన చిన్నారి ఉదంతాన్ని మర్చిపోకముందే మరో ఘటన వెలుగు చూసింది. ఉమ్మిడివరంలో వ్యవసాయ పనుల కోసం తవ్విన బోరుబావి మీద మూత వేయడం మర్చిపోయారు. ఈ చిన్న నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివర౦లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడివరానికి చెందిన మల్లికార్జునరావు కుమారుడు (2) చంద్రశేఖర్ ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డట్టుగా ప్రాథమిక సమాచారం అందింది. ఆ బాలుడు 20 అడుగుల లోతులో పడిపోయినట్టుగా సమాచారం. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందం, అధికారులు సంఘటన స్థలానికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో అధికారులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు అందించనున్నారు.