సోషల్ మీడియా లో జోరు మీదున్న వైసీపీ

SMTV Desk 2019-03-29 17:55:43  Tiktok, ycp,

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. రాజకీయ నాయకులు ప్రచారానికి ఏ అస్త్రాన్నీ వదలడం లేదు. ప్రచార సభలు, మీడియా ప్రకటనలతో పాటు సామాజిక మాధ్యమాలను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. నాయకుల రాజకీయ సభలకు రావడానికి ఆసక్తి చూపని యువత దగ్గరికి చేరడానికి వారు వాడే మాధ్యమాలనే ఆశ్రయిస్తున్నారు.

యువత సరదాగా ఉపయోగించే టిక్ టాక్ సోషల్ మీడియా యాప్ కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. రాజకీయ నాయకులు పోటీ పడి ఈ యాప్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈ యాప్‌ లైబ్రరీలో హుషారెత్తించే సినిమా పాటలు.. సినిమా పాటలు, ఊపుతెప్పించే డ్యాన్సులతో పాటు ఇప్పుడు రాజకీయ నాయకుల పంచ్ డైలాగులు కూడా వచ్చి చేరాయి. అచ్చంగా రాజకీయ నాయకుల డైలాగులను అనుకరిస్తూ మరో వీడియోని రూపొందిస్తున్నారు యూజర్లు. వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ విధంగా యువత రాజకీయలకు దగ్గరవుతుందని నాయకులు సంబరపడుతున్నారు. కొన్ని పార్టీలైతే తమ నాయకుల డైలాగులతో సామాన్యుల చేత వీడియోలు చేయించి ప్రచారం చేస్తున్నాయి.

ఈ మధ్య నరేంద్రమోదీ ‘చౌకీదార్‌..’ అంటూ ఉపన్యాసం ఇచ్చారు కదా. ఆ డైలాగు టిక్‌ టాక్‌లో విపరీతంగా వైరల్ అయింది. దానికి కౌంటర్‌గా రాహుల్‌ గాంధీ ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. రాహుల్ డైలాగ్‌ను మోదీ డైలాగ్‌కు పోటీగా ప్రచారం చేసారు.

నేను విన్నాను.. నేను ఉన్నాను..

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టిక్ టాక్ ప్రచారంలో వైసీపీ పార్టీ దూసుకుపోతుందని తెలుస్తోంది. ‘యాత్ర’ చిత్రంలోని ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే డైలాగును జగన్ ప్రతి సభలో, రోడ్ షో వాడుతున్నాడు. ఈ డైలాగు యువతను ఎంతో ఆకట్టుకుంది. వారి రోజువారీ జీవితాల్లో కూడా ఈ డైలాగులను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా స్నేహితులు ఏమైనా అడిగితె.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ సరదాగా డైలాగ్ కొడుతున్నారు. అందుకే ఈ డైలాగు టిక్ టాక్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

అలాగే చంద్రబాబు ఉపయోగిస్తున్న డైలాగులు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.. ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’, ‘నేను మీ చంద్రబాబునాయుణ్ని మాట్లాడుతున్నా..’ కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ పాటలు, పవన్‌ కల్యాణ్‌ పవర్ పంచులు.. ఇలా తెలుగులో క్రేజీ పొలిటికల్ టిక్ టాక్ వీడియోలు రూపొందుతున్నాయి. వీటి నిడివి అర నిమిషం, నిమిషం కంటే తక్కువ ఉండడంతో ఎక్కువ మంది చూడటానికి ఇష్టపడుతున్నారు. మనదేశంలో రెండున్నరకోట్ల మంది ఈ టిక్‌టాక్‌ యాప్‌ వాడుతున్నారు. అంతేకాదు నెలకు ఈ యాప్‌కోసం మూడున్నర గంటల సమయం కేటాయిస్తున్నట్టు అంచనా. అందుకే నాయకులు ఈ తరహా ప్రచారాలతో యువతపై గురిపెట్టారు.