వైసీపీ-టీడీపీ మధ్య కరెన్సీ యుద్ధం

SMTV Desk 2019-03-25 13:19:38  currecy, cash india

ఏపీలో భానుడి ప్రతాపాన్ని తలదన్నేలా ఎన్నికల వేడి పెరిగిపోతోంది. నామినేషన్లు ఘట్టం ఆఖరి ఘట్టానికి చేరడంతో ప్రచారం మీద ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. విమర్శలు, ప్రతి విమర్శలతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఇదే క్రమంలో నెల్లూరులో వైసీపీ-టీడీపీ మధ్య కరెన్సీ యుద్ధం మొదలయ్యింది. నెల్లూరులోని చిన్న బజార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డబ్బు ఉందని వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి ఇద్దర్ని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.15లక్షలు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయినట్లు వైసీపీ ఆరోపిస్తోది.

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నెల్లూరు టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఎమ్మెల్యే అనిల్‌ ఆరోపిస్తున్నారు. అవినీతి డబ్బుతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ బలంగా ఉండే ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బందితో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రభుత్వ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.