కిడ్నీ బాధితులకు వరాల జల్లు కురిపించిన జగన్

SMTV Desk 2019-03-25 11:07:35  Kidney, Jagan,

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీ నాయకులు వరుసపెట్టి వాగ్దానాలు, వరాలు జల్లులు కురిపిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘పాదయాత్రలో పలాస ప్రజల కష్టాలు చూశాను. వైసీపీ అధికారంలోకి వస్తే కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. స్థానిక సమస్యలను పరిష్కరిస్తాం. అధికారంలోకి వస్తే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టం తీసుకొస్తాం. కిడ్నీ బాధితులను అన్నీ విధాలుగా ఆదుకుంటాం. హుదూద్‌, తిత్లీ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. రైతు రుణమాఫీ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాలేవు’ అని అన్నారు జగన్.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్‌ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని.. 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో మోసం, అబద్దంతో చంద్రబాబు ఐదేళ్ల పాలన సాగిందని ఆరోపించారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఈసారి వచ్చేది ప్రజల ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.