చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ

SMTV Desk 2019-03-18 17:47:24  Chandrababu,

అమరావతి, మార్చ్ 18: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మీపిస్తున్న త‌రుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్ప‌టికే ప‌లువు కీల‌క నేత‌లు టీడీపీ నుండి జంప్ అయ్యి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు అభ‌ర్ధుల జాబితాలో చోటు ద‌క్కించుకున్న నేత‌లు కూడా టీడీపీ నుండి జంప్ అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టీడీపీ నుండి నెల్లూరు రూర‌ల్ టిక్కెట్ ద‌క్కించుకున్న ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఒక రోజంతా అదృశ్య‌మై.. ఏకంగా వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ టిక్కెట్ ద‌క్కించుకున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా మ‌రో టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి అజ్ఞాతంలోకి వెళ్ళార‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గుర్తు పై గెలిచి టీడీపీలోకి జంప్ అయిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి రెండు రోజులుగా టీడీపీ నేత‌ల‌కు అందుబాటులో లేకుండా పోయార‌ని తెలుస్తోంది.

బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్ధి శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి బ‌లంగా ఉండ‌డంతో, తాను పోటీ చేసినా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు బుడ్డా స‌తీమ‌ణి అనారోగ్యంతో ఉండ‌డంతో ఆయ‌న పోటీ నుండి త‌ప్పుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో తాజాగా బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా, ఆయ‌న ఫోన్ స్విచ్ఛాఫ్ రావ‌డంతో టీడీపీ శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొంది. ఇక బుడ్డా వ్య‌వ‌హారం చూస్తుంటే ఆయ‌న పోటీ నుండి త‌ప్పుకునే అవ‌కాశం ఉండ‌డంతో టీడీపీ అధిష్టానం మ‌రో అభ్య‌ర్ధి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఏది ఏమైనా ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబుకు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.