వైఎస్ వివేకానందరెడ్డిది సహజమరణం కాదు: వైఎస్ అవినాష్ రెడ్డి

SMTV Desk 2019-03-15 14:17:19  YS Vivekananda reddy,

హైదరాబాద్, మార్చ్ 15: వైఎస్ వివేకానందరెడ్డిది సహజమరణం కాదని తమకు అనుమానాలు ఉన్నాయని, వైఎస్ అవినాష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తమల్ని తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించిన అవినాష్, పెదనాన్న తలపై రెండు గాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాత్ రూములో కాలుజారిపడితే తలకు వెనుకవైపు లేదా ముందు వైపు మాత్రమే గాయం అవుతుందని, రెండు వైపులా గాయం అయ్యే పరిస్థితే ఉండదని చెప్పారు. అవి పెద్ద గాయాలని, చేతిపైనా, ముఖంపైనా గాయాలున్నాయని ఆయన అన్నారు. ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్ధమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్నంతా మైదుకూరులో ప్రచారం నిర్వహించిన ఆయన, నేడు మరణించి వుండటమేంటని, పూర్తి ఆరోగ్యంతో నిన్న కనిపించిన మనిషి, నేడు మరణించడం ఏంటని, ఈ అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.