తప్పు చేసిన వారెవ్వరు తప్పించుకోలేరు : డీజీపీ సాంబశివ

SMTV Desk 2017-08-07 11:31:31  AYESHA MEERA MURDER MYSTERY, DGP SAMBHASHIVA RAO, CHARMEN NANAPANENI RAJAKUMARI

విజయవాడ, ఆగస్ట్ 7 : సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో భాగంగా తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. నిజానిజాలు బయట పడతాయ౦టూ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు తెలిపారు. విజయవాడ క్లబ్‌ కమిటీ ఆద్వర్యంలో అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయేషా హత్య కేసును తిరిగి పునర్విచారణ చేయనున్నట్లు తెలిపారు. సిట్‌ విచారణలో నిజానిజాలు తేలుతాయని, కొత్త సాక్ష్యాల సేకరణకు సమయం పడుతుందని అన్నారు. కాగా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమన్నారు. దేశ సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి సేవలు మరువలేనివంటూ వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. నక్సలైట్లను ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్‌ పోలీసులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. గ్రేహౌండ్స్‌ పోలీసులను కలిగి ఉన్న రాష్ట్రం మనదేనని, అయినా అప్పుడప్పుడు దాడులు జరుగుతున్న వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మహిళ కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. ఆయేషా తల్లిదండ్రులకు, ప్రభుత్వం, మహిళా కమీషన్‌ అండగా ఉంటుందని, ఈ కేసులో అసలైన దోషులకు శిక్షపడే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్‌ మాజీ డీజీ దుర్గాప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.