తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసనలు

SMTV Desk 2019-03-05 18:42:04  drinking water problem, chittoor, summer, womens strikes for drining water

చిత్తూర్, మార్చ్ 05: చిత్తూర్ జిల్లాలో అప్పుడే ఎండాకాలం ప్రభావం గట్టిగా పడింది. తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసనలు చేపట్టారు. పూర్తి వివరాల ప్రకారం...మున్సిపల్‌ పరిధి కొత్తపేట 20 వ వార్డు బిటిఎం స్ట్రీట్‌‌కు గత 15 రోజులుగా తాగునీరు రావడం లేదంటూ ఆ కాలనీ మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ…తాగునీరు సరఫరా కాకపోతే.. తామంతా ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు అధికారులు పరిష్కారం చూపేంత వరకు రోడ్డుపై నుండి లేచేది లేదని పట్టుబట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. మున్సిపల్‌ కమిషనర్‌ రంగస్వామి, ఎఇ నిరంజన్‌ రెడ్డిలతో కలిసి ఆందోళనకారులతో చర్చించారు. తాగునీటి వనరులు తగ్గాయని, నూతనంగా బోర్లు వేస్తున్నామని మహిళలకు చెప్పుకొచ్చారు. నీటి సరఫరా లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు కూడా నీటిని దుర్వినియోగం చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అధికారుల హామీతో మహిళలంతా తమ నిరసనను విరమించారు.