ఐ‌టి గ్రిడ్స్ కేసు లేటెస్ట్ అప్ డేట్స్

SMTV Desk 2019-03-05 12:25:03  IT grids,

టీఆర్ఎస్‌, వైసీపీ-టిడిపిల మద్య జరుగుతున్న రాజకీయయుద్ధానికి హైదరాబాద్‌ వేదిక కావడం విశేషమే. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో బ్లూ ఫ్రాగ్‌ ఐ‌టి గ్రిడ్ మొబైల్‌ టెక్నాలజీ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ (ఐ‌టి గ్రిడ్స్) కేంద్రంగా ఈ యుద్దం జరుగుతోంది.

తమ సంస్థకు చెందిన రేగొండ భాస్కర్‌, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ రెబ్బాల అనే నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ సోమవారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆ నలుగురిని ఈరోజు ఉదయం తమ ముందు ప్రవేశపెట్టాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది.

హైకోర్టు ఆదేశం మేరకు ఆ నలుగురిని పోలీసులు నేడు హైకోర్టులో ప్రవేశపెట్టారు. వారికి తాము నోటీసులు మాత్రమే ఇచ్చామని ఎవరినీ నిర్బందించచలేదని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెప్పిన దానిని ఆ నలుగురు ఉద్యోగులు కూడా దృవీకరించడంతో అశోక్ వేసిన పిటిషనును హైకోర్టు కొట్టివేసింది. కోర్టులో ఈ కేసు ఈవిధంగా ముగియగా బయట టీఆర్ఎస్‌, వైసీపీ-టిడిపిల మద్య చాలా జోరుగా మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి.

ఏపీ ప్రజల ఆధార్,, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నెంబర్లు వగైరా వ్యక్తిగత సమాచారాన్ని, ఏపీలో సంక్షేమ పధకాల లబ్దిదారుల వివరాలను టిడిపి సహాయంతో ఐ‌టి గ్రిడ్స్ దొంగిలిస్తోందనేది తెరాస, వైకాపాల వాదన.

ఒకవేళ అటువంటి నేరం చేయలేదని టిడిపి భావిస్తున్నట్లయితే కోర్టు విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. టిడిపికి దమ్ముంటే ధైర్యంగా ఈ కేసును కోర్టులో ఎదుర్కొని తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్‌ టిడిపి నేతలకు సవాలు విసిరారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత వివరాలను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఐ‌టి కంపెనీకి అప్పజెప్పి సిఎం చంద్రబాబునాయుడు రాజద్రోహానికి పాల్పడ్డారని వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

ఏపీలో టిడిపికి 60 లక్షల మంది సభ్యులున్నారని వారి మద్య వారధిగా ‘సేవా మిత్రా’ మొబైల్ యాప్ ను ఐ‌టి గ్రిడ్స్ సంస్థ నిర్వహిస్తోంది తప్ప ఏపీ ప్రభుత్వం కోసం అది పనిచేయడం లేదని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నేటికీ ఏపీలో బూత్ స్థాయి క్యాడర్ లేని వైకాపా, ఓటమి భయంతో తెలంగాణ ప్రభుత్వం అండదండలతో టిడిపి డేటాను దొంగిలించి ఎన్నికలలో తమను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోందని బోండా ఉమా వాదించారు.