తోటి మహిళగా అర్థం చేసుకుంటే బాగుండేది: భూమా అఖిలప్రియ

SMTV Desk 2017-08-05 17:31:46  TDP minister Akhilapriya encounter to roja, Bhuma Akhila priya, Roja

నంద్యాల, ఆగష్ట్ 5: నంద్యాల ఉపఎన్నికల ప్రచారం వాడి-వేడిగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అఖిల ప్రియ సానుభూతి ఓట్ల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి భూమా అఖిల‌ప్రియ స్పందించారు. ఎన్నికల ఒత్తిడితో వచ్చిన కోపం వల్ల రోజా ఆ మాటలు అన్నట్టున్నారని, వాటిని తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అఖిల‌ప్రియ స్పష్టం చేశారు. అలాగని తన తల్లిదండ్రుల గురించి అనడం సమంజసం కాదని ఆమె తెలిపారు. మా తండ్రి మీద మాకు ప్రేమ లేద‌న్న‌ట్లుగా రోజా అనడం నాకు బాధ కలిగించింది. ఆయన చ‌నిపోయాక అసెంబ్లీకి వెళ్లిన మాట నిజమే.. మా తండ్రి కేడర్ దెబ్బ‌తినకూడ‌ద‌నే ఉద్దేశంతోనే అంత బాధలోనూ అసెంబ్లీకి వెళ్లాను. అందుకు మెచ్చుకోకున్నా తోటి మహిళగా అర్థం చేసుకుంటే బాగుండేదని అఖిలప్రియ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ నేపధ్యంలో తన తల్లిదండ్రులు ఎవరినీ వ్యక్తిగతంగా విమ‌ర్శించ‌లేద‌ని, తాను కూడా అలా చేయనని ఆమె పేర్కొన్నారు. సానుభూతి కోసం అమ్మానాన్నల ఫొటోలను ఉప‌యోగించుకున్నార‌నే విమర్శలపై స్పందిస్తూ జగన్‌కి తన తండ్రి ఎలాగో, మాకు మా తండ్రి కూడా అలాగే‌. అయినా అలా ఉపయోగించుకుంటే త‌ప్పేంటి? అని మంత్రి అఖిలప్రియ‌ ప్రశ్నించారు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఆళ్ళగడ్డ‌, నంద్యాల ప్ర‌జ‌ల‌కు త‌మ కుటుంబం అండగా ఉంటుంద‌ని అఖిల‌ప్రియ వెల్లడించారు