ఎన్నికలకు 'మంద'స్తు ఏర్పాట్లు

SMTV Desk 2019-02-22 15:22:02  Andhrapradesh, Elections, Belt Shops

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాకముందే భారీగా మద్యం నిల్వలు చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటి వరకు బెల్టు షాపులుగా కొనసాగిన మద్యం గోడౌన్లు రాబోయే రెండు నెలల పాటు భారీగా నిల్వ చేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే మద్యం వ్యాపారులకు డిమాండ్ పెరగనుంది.

కాగా, ఏపీబీసీఎల్‌ నుంచి సరుకు సరఫరా చేసే అవకాశం ఉండదు. గత ఏడాదిలో ఆ నెలకు సంబంధించి ఎంత మేర వ్యాపారం చేశారో అంతకు అధికంగా పది శాతం మాత్రమే సరుకు సరఫరా చేస్తారు. అంత వరకు మాత్రమే వ్యాపారుల నుంచి డీడీలు స్వీకరిస్తారు. గతేడాది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనవరి నెలకు సంబంధించి రూ. 1,690 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది జనవరిలో రూ. 2 వేల కోట్లకు పైగా సరుకు కొనుగోలు జరిగింది.

మద్యం వ్యాపారంలో ఎక్కువ శాతం అధికార పార్టీ నేతలే ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి నెలలో రూ.1,338 కోట్ల విలువైన మద్యం సరఫరా ఏపీబీసీఎల్‌ నుంచి జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికే ఏపీబీసీఎల్‌ నుంచి రూ. 1.004 కోట్ల విలువైన సరుకు కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 4,380 మద్యం షాపుల్లో సరుకు కొనుగోళ్ల వివరాలు సరిగా లేవు.

గతంలో మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు, ఆన్‌లైన్‌ మద్యం విక్రయాలు చేపట్టేలా ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. అసలు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు పర్యవేక్షించే అవకాశమే లేకుండా పోయింది ఇప్పుడు. దీంతో మద్యం సిండికేట్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా నిల్వలు చేసే పనిలో పడ్డారు.