టీడీపీ తో జనసేన పొత్తు...???

SMTV Desk 2019-01-03 11:51:53  TDP, Janasena, Andhrapradhesh Assembly elections, Pawan kalyan, Chandrababu

అమరావతి, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెదేపా తో కలిసి పోటీ చేస్తుందా లేక వొంటరిగా నిలబడుతుందా అని రాష్ట్రమంతా చాల ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తే తప్పేంటి అని చేసిన వ్యాఖ్యలపై ఈ అనుమానం మరింత బలంగా మారింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ స్పందిస్తూ పార్ట్‌నర్స్ ముసుగు తొలగిపోయిందని ఇంతకాలం శత్రువుల్లా నటించిన వీరి బాగోతం బయటపడిందంటూ విమర్శించారు. మరోవైపు బాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ కానీ, నేతలు కానీ స్పందించలేదు అన్నింటికన్నా ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇంత వరకు వొక్క మాట కూడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అయితే ఆయన వెంట ఉండే వారు మాత్రం పవన్ సరైన సమయంలో స్పందిస్తారని చెబుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సినవేమీ కాదనే అభిప్రాయంతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీనేతలు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం పవన్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు ఎక్కడ నలుగురు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. పవన్ గురువారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ ఆయన ఇంటి వద్దే కీలక నేతలతో సమావేశమయ్యారు. పవన్ ఏదో వొకటి స్పందించని పక్షంలో టీడీపీ-జనసేన దోస్తీ నిజమేనన్న భావన ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లే అవకాశం ఉందని అందువల్ల పార్టీకి నష్టం కలిగే సూచనలు ఉన్నాయని పలువురు నేతలు పవన్‌తో అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నేతలతో చర్చించి ఈ రోజు లేదా రేపు పవన్ మీడియా ముందుకు వస్తారో, లేదంటే తనకు అలవాటైన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి ఈ సస్పెన్స్‌కు తెరదించుతారో వేచి చూడాలి.