గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు

SMTV Desk 2018-12-27 11:09:06  Andhrapradesh, Governament, Group 1 exams

అమరావతి, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేశారు. ఈ మార్పులపై అధికారిక ఉత్తర్వులు బుధవారం వెల్లడించారు అధికారులు. ఇదివరకు గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష కింద వొక పరీక్షనే నిర్వహించేవారు. కమిషన్‌ ప్రతిపాదించిన మేరకు ఖరారు చేసిన కొత్త విధానంలో పేపరు-1, పేపరు-2 కింద రెండు పరీక్షలను రెండు గంటల చొప్పున నిర్వహిస్తారు. వొక్కొక్క పరీక్ష 120 ప్రశ్నలతో 120 మార్కులకు (మొత్తం 240) ఉంటుంది. మెయిన్స్‌లో ఆంగ్లం అర్హత పరీక్షగా ఉండేది. దీంతోపాటు తెలుగును ప్రత్యేకంగా నిర్వహిస్తూ అర్హతను తప్పనిసరి చేశారు.

అంతేకాకుండా తెలుగును ఆంగ్ల పరీక్ష మాదిరిగానే 150 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మిగిలిన ఐదు పరీక్షలను కూడా పేపరు-1నుంచి పేపరు-5 వరకు వొక్కోదానికి మూడు గంటల వ్యవధినిచ్చి నిర్వహిస్తారు. వొక్కో పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. 75 మార్కులకు మౌఖిక పరీక్షను నిర్వహిస్తారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక ఉత్తర్వులనిచ్చింది.