ఆంధ్రాలో ఈ నెల 27 న బంద్ : సీపీఎం పార్టీ

SMTV Desk 2018-12-22 11:53:41  Andhrapradesh, CPM Party, Bandh, Rayalaseema

అనంతపురం, డిసెంబర్ 22: రాష్ట్రంలో ఈ నెల 27 న రాయలసీమలోని 4 జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల బంద్‌ చేపడుతున్నామని సీపీఎం పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. కరవు మండలాలు ప్రకటించి 3 నెలలు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కూడా కనీసం తక్షణ సహాయక చర్యలు సైతం చేపట్టకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని నిరశిస్తూ సీపీఐ, సీపీఎంలు సంయుక్తంగా ఈనెల 27వ తేదిన రాయలసీమలోని 4 జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల బంద్‌ చేపడుతున్నామని సీపీఎం పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బంద్‌ ఉద్దేశాన్ని రైతులకు, ప్రజలకు వివరించడానికిగాను ఈనెల 23, 24 తేదీల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనసేన, కలిసొచ్చే ఇతర ప్రజా, ఉద్యోగ, కార్మిక సంఘాలతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో రైతులు సాగుచేసిన పంటలకు వర్షాభావ పరిస్థితుల కారణంగా 2వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. ఖరీఫ్‌లో 1,687 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర కరువు బృందానికి స్వయంగా జిల్లా కలెక్టరే అధికారికంగా నివేదిక అందజేయగా రబీలో 236 కోట్ల పెట్టుబడులకు నష్టం వాటిల్లిందన్నారు. హెచ్‌ఎల్‌సీ కింద జిల్లాలో సాగైన ఏవొక్క పంటకు కూడా పాలకులు పూర్తీస్థాయిలో నీరందించలేకపోయారని విమర్శించిన ఆయన దక్షిణ కాలువ కింద శింగనమల మండలంలో 46వేల ఎకరాలు సాగవ్వగా రెండు నెలలు నీళ్లిచ్చి ఇప్పుడు నిలిపివేశారన్నారు.

ఉత్తర కాలువకు నవంబర్‌లోనే నీరు విడుదల చేయాల్సి వుండగా ఇప్పటి వరకు విడుదల చేయలేదని పీఏబీఆర్‌ కుడి కాలువకు నీటిని నిన్నటిరోజు హడావుడిగా విడుదల చేశారని ఎద్దేవా చేశారు. జీబీసీ, టీబీసీలకు నీరు మధ్యలో ఆగిపోయిందని నీటి నిర్వహణ పద్దతులు సరిగ్గా లేని కారణంగా జిల్లాలో రైతాంగం నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో వర్షాలు లేకపోగా హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా కాలువల నీటిని సరిగ్గా ఉపయోగించుకోకపోవడంవల్ల వేల కోట్ల పంటనష్టం సంభవించిందని రాంభూపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లకింద సాగుచేసిన పంటలకు తెగుళ్లు సోకి ఉరవకొండ ప్రాంతంలో మిరప, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో పత్తికి అపారనష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆరుతడి పంటలకు ఎకరాకు 25వేల రూపాయల పంటనష్టంతోపాటు 4,5 విడతల రుణమాఫీ మోత్తాన్ని ఈనెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం అన్యాయం చేసిందని ధర్మపోరాటం చేస్తున్నారని ఆయన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గుర్చి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈనెల నిర్వహించి ధర్మపోరాట దీక్షకు సీయం జిల్లాకు వచ్చినపుడైనా రుణమాఫీ వొకే విడతలో అమలు, పంటనష్టం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉరవకొండ ప్రాంతీయ కార్యదర్శి ఎ.రంగారెడ్డి, నాయకులు కె.ఆంజినేయులు, విరుపాక్షి, వీరశేన తదితరులు పాల్గొన్నారు.